1, జూన్ 2013, శనివారం

మంచి పిల్లలూ!......గురువు దేవునితో సమానమా?....... కాదా?.....

                     నిజానికి గురువు దేవునితో సమానం కాదు.
                  ఎందుకంటే!గురువు దేవుని కంటే ఎంతో గొప్పవాడు.
కేవలం దేవుడు నమ్మకంతో ముడిపడ్డాడు..మన శ్రీ గురువు కనుల ముందు కనుపించే మహనీయుడు.మనిషి తన జీవితంలో తీర్చుకోలేనిది గురువుల ఋణం ఒక్కటే! అందువల్లనే "మాతృదేవోభవ""పితృదేవో భవ"అన్న తరువాత ఆచార్యదేవోభవ" అని చెప్పి గురువు స్థానాన్ని తెలియజేశారు.మన పూర్వీకులు. తల్లి,తండ్రి తరువాతస్థానం గురువుదే!దైవత్వాన్ని కూడా గురువు ద్వారానే దర్శించవలసి ఉంటుంది.
                         అజ్ఞాన తిమిరాంధస్య,జ్ఞానాంజన శలాకయా,
                         చక్షురున్మీలితంయేన తస్మైశ్రీ గురవేనమహ:.
అజ్ఞానమనే గ్రుడ్డితనాన్నిజ్ఞానమనే కాటుకనిచ్చి కనులు తెరిపించిన శ్రీ గురువులకు నమస్కారములు అని శ్లోకా
ర్ధమూ ,అదే లోకార్ధమూ కూడా!బ్రిటిష్ పాలకుల రాకతో గురు కులాలు,గురుకుల విద్యాభ్యాసాలు పోయాయి."మెకాలే దొర"విద్యా పద్ధతిలో గురు మర్యాదలు పూర్తిగా పోయాయి.పూర్వకాలం గురువుగారు కూర్చుంటే శిష్యులు నిలుచుండి పాఠాలు వినేవారు.ఇప్పుడు కాలి బూట్లతో శిష్యులు కూర్చుని ఉంటే గురువు గారు నిల్చుని పాఠాలు చెప్పాలి.
(దీనినే మెకాలే పద్ధతి"అంటారు.)
విద్య వ్యాపారమైంది ఈ నాడు.చదువుకునే వారు తగ్గిపోయారు. చదువుకొనే వారు రెచ్చిపోతున్నారు.ఎప్పుడైతే విద్యా బోధనకు విలువలు తగ్గి,విద్యాలయాలు వ్యాపార సంస్థలుగా మార్పు చెందాయో అప్పుడే గురువులు గుండ్రాయిలయ్యారు.నేడు గురువులు 'మాష్ట
రు' అయ్యారు.ఇప్పుడింకా మరి కొద్దిగా క్రిందకు దిగి 'సార్'లు అయ్యారు.
అయ్యో! గురువా!నీకెంత దుర్గతి పట్టిందయ్యా!
ఈ మార్పుకి కేవలం శిష్యులే కారణం కాదు.గురువులు కూడ ఎంతో కొంత కారణమవుతున్నారు.విద్యాలయాల్లో కూడా కులవివక్షను చూపిస్తున్నారు.వ్యాపార ధోరణిని ప్రదర్శిస్తున్నారు.ఇపుడు విద్యాలయాలు విజ్ఞాన నిలయాలు కావు.ఆర్జనా నిలయాలుగా మారి, బ్రతుకుదెరువు మార్గాన్ని మాత్రమే బోధిస్తున్నాయి.

                              "యధాగురు:తధా శిష్య:"
ఏది ఏమైనా గురుస్థానం గురువుదే కదా!గురువును దేవునిగా భావించి సాగిలపడి దండాలు పెట్టకపోయినా ఏనాడైనా,ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురుపడితే,అభిమానంగా పలకరించండి!గురువులు కోరుకొనేది ఇంతే!మనం గొప్పవాళ్ళమయ్యామని,ప్రయోజనపరులయ్యామని,వారికి తెలియజేసి చూడండి!హృదయ పూర్వకంగా ఎంత సంతోషిస్తారో!మీ కళ్ళతో మీరే చూడండి!ఏది ఏమైనా గురూపకారం మరువలేనిది అని మీరే గుర్తిస్తారు.అలాగే మనల్ని కన్న తల్లిదండ్రుల్నికూడా మరవకూడదు.వారి తర్వాతే గురువు మరి!