1, సెప్టెంబర్ 2012, శనివారం

"దండం దశ గుణం భవేత్"

ఇటీవల ఒక మిత్రుడు తన మాటల్లో,"దండం దశ గుణం భవేత్" అంటారు గదా!దండం పెట్టడం పది రకాలట గదా ! అ దండాల గురించి కొంచెం చెపుతారా ? అని నా మీద,ఒక ప్రశ్నా బాణాన్ని సంధించాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది!ఇదేమిటి? దండం ఏమిటి ?పది రకాలేమిటి?అని.ఆతను భావించినట్లుగా ,ఇక్కడ" దండం " అంటే, మీరు కూడా నమస్కారం అనుకుంటారేమో?ఇక్కడ "దండం "అంటే,"చేతి కర్ర" అని అర్ధం."దండ ప్రమాణం" అనే మాట కూడా ఇందులోంచి వచ్చినదే! ఇది పూర్వ కాలం గురువుల చేతుల్లో,ఎక్కువగా చిన్న సైజులో కనుపించేది.దాన్ని" బెత్తం " అని మా రోజుల్లో పిలిచేవారు.అలాగే , చిన్నికృష్ణుడు  గోవులను మేపుతూ,విమల శృంగము,వేత్ర దండము ధరించాడని,పోతన మహా కవి భాగవతంలో వర్ణించాడు కూడా .మా రోజుల్లో విద్యార్ధులకు, సగానికి సగం, క్రమశిక్షణ దీని ,ద్వారానే అలవడేది.అంటే! మీరు నమ్ముతారా?భయానికి మారు పేరుగా ఈ దండం..నాడు ఉపాధ్యాయుల చేతుల్లో,తరచూ ఇది కనుపిస్తూ ఉండేది.
                                    ఇప్పుడు దీని పేరెత్తినా,ఇది చేతిలో కనిపించినా, ఉపాధ్యాయులను శిక్షించమని! ప్రభుత్వం వారు ఉత్తర్వులు దఖలు పరిచారు.అది వేరే విషయం అనుకోండి!.అలా అంటే,మీ వంటివారు కూడా,ఎంతమంది ఉపాధ్యాయులు బిడ్డల్నిశిక్షించడం లేదు ?ఎన్ని కేసులు చూడడం లేదు? అంటూ నన్ను ప్రశ్నిస్తారు.ఐతే ఇక  అసలు విషయానికి వద్దాం!ఈ" కర్ర " మనకు సన్యసించిన ,స్వామీజీల, అవధూతల,అఘోరాల, చేతిలో,పొడవైన దండం లాంటిది,మనం చూస్తూ ఉంటాం.దానికి కాషాయ వస్త్రాలు కూడా చుట్టి ఉంటాయి.అందుకే వారిని" త్రిదండి "వంటి గౌరవ పదాలను ముందుంచి, పిలుస్తూ ఉంటాము.వారి మనో, వాక్, కాయ రూపాలను ఈ దండంగా  భావించి,మనం ఈ పేరుతొ గౌరవిస్తూ ఉంటాం.మనం వారికి చేసే,ప్రతీ నమస్కారమూ, ఈదండం ద్వారా భగవంతునికి చేరుతుందని,భక్తుల నమ్మకం.ఇలా చెప్పుకుంటూ పోతే... ఈ దండం,మనకు 10 రకాలుగా నిత్య జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది.కాబట్టే 
" దండం దశ గుణం భవేత్" అనే వాక్యం వచ్చింది.ఆ పది ఉపయోగాల లోక భావాన్ని కలిగిన,ఒక  చిన్న శ్లోకాన్నిఇక్కడ మనం ముచ్చటించుకుందాం.
                                           "  విశ్వా~మిత్రా~హి, పశుషు,
                                                కర్దమేషు ,జలేషు చ,
                                                 అంధే,తమసి వార్ధక్యే,
                                                 దండం దశ గుణం భవేత్."
 అంటే!నిత్య జీవితంలో,మానవునికి ఈ దండం అనేది 10 రకాలుగా  ఉపయోగపడుతోంది.
1. "వి "=అనగాపక్షులను,అదలించడానికి,
2" శ్వ" =అనగా కుక్కలను ,బెదరించడానికి,
3. "అమిత్ర "=అనగా శత్రువులనుండి ఆత్మ రక్షణ పొందడానికి,
4. "అహి "=అనగా పాములనుండి,రక్షణ పొందడానికి,
5."పశుషు "=పశువులను,అదలించడానికి,
6 "కర్దమేషు "=అనగా బురద వంటి ప్రదేశాల్లో, పడకుండామన కాపుకోసం,
7. "జలేషు "=జలాలలో దిగినప్పుడు,లోతు,తెలుసుకోవడానికి,
8." అంధే"=కనుచూపు లేనివారికి,ఊతగాను
9. "తమసి "=చీకటిలో ,రక్షణగాను,
10."వార్ధక్యే "=ముసలితనంలో ,ఊతంగాను,
ఇలా ఈ దండాన్ని ఉపయోగించుకోవచ్చును.అని చెబుతాం.ఈ దశ గుణాలను మనం రోజూ అనుభవిస్తూ ఉన్నా,ఆ విషయాన్ని వదిలేసి,కేవలం నేడు" వీధిజనభయంకరుల " చేతుల్లో,ఆయుధాలుగా మాత్రమే మనం ఊహించుకుంటూ, ఈ దండానికి మనమే,విపరీతార్ధాలుతీస్తున్నా,ఈ అసలు అర్ధాలను గమనించమని నా మిత్రునితో చెప్పిన విషయం, అందరికీ  ఉపయోగిస్తుందని మీతో ఈ రోజు ఇలా ప్రస్తావించాను.ఇందులోని మంచిని గ్రహించండి.చెడునివిసర్జించండి.