3, జూన్ 2012, ఆదివారం

coat has gone out, in search of boot.

                   ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తించారా?ఆయనే మన   "ఆంధ్ర రత్న " శ్రీ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గారు, భారతీయ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో పేరు పడ్డ వారు."చీరాల -పేరాల " వంటి ప్రముఖ ఉద్యమాల రధ సారధి.వారిని గూర్చిఒక చిన్నహాస్య సన్నివేశాన్నినేడు ముచ్చటించుకుందాం.. 
శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు,చిన్ననాటి నుంచీ,సహజ మేధా సంపన్నుడు.
ఆయన గారు,నోరు విప్పిఏమి మాట్లాడినా,చాతుర్యం పాలు సగమైతే, సాహసంపాలు మిగతా సగం ఆక్రమించి సంభాషణకి, సమగ్రతని, హుందాతనాన్ని, సంపాదించి పెట్టేవి.
ఆయన ఉదాత్త విగ్రహాన్నిచూసేటప్పటికే,క్రొత్తవాళ్ళ గుండెలు జారిపోయేవి.
ఏమంటే,తమకు ఏమి తంటా వస్తుందో?అని బిక్కు బిక్కుమంటూ 
ఆయన ముందు,అపరిచితులు నో మాట పెగలక నీళ్ళు నములుతూ ఉండే వారు.
ఇంగ్లీషులో ఆయనకున్న వాగ్ధాటి,భారతీయులకే కాక పాశ్చాత్యులకు కూడా నోటికి తాళం వేయించేది.
 అలాంటి ఆయన ఒకసారి,ఒక రాత్రి రైల్లో,ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేస్తున్నాడు.
ఆ పెట్టె మొత్తానికి ఆయన ఒక్కడే ఉన్నాడు.
తరువాత కొంత సేపటికి,ఒక స్టేషన్లో ఇంకొక దొర ఎక్కాడు.
ఇప్పుడా పెట్టెలో వాళ్ళిద్దరే ప్రయాణీకులు.
గోపాల కృష్ణయ్య కూడా, బ్రిటిష్ దొరలాగానే ఫుల్ సూట్లోఉన్నాడు.
దొర కంటే కాస్త ఒడ్డూ పొడుగూ,ఉన్నాడు మన గోపాల కృష్ణయ్య .
దొర ఒకసీట్లోకూర్చున్నాడు.కాలక్షేపానికి గోపాల కృష్ణయ్య , పెట్టెలోఅటునుంచి ఇటూ,ఇటునుంచిఅటూ, నిర్విరామంగా తిరుగుతున్నాడు.
ఆ బూట్ల చప్పుడు,దొరకు ఇబ్బందకరంగాతోచింది.
తిరగొద్దని చెప్పడానికి,దొరకి దమ్ములుంటేగా?
ఆ ధ్వని భరించ లేకుండా ఉన్నాడు.
ఇలా కొంత సేపు తిరిగి,తిరిగి ఆ తర్వాత ఆ బూట్లు విప్పి,అవి తన బల్లక్రింద పెట్టిహాయిగా నడుం వాల్చాడు.
కొంత సేపటికి గుర్రు పెట్టి మరీ నిద్ర పోతున్నాడు.
అప్పుడు దొర "ఇతను లేచాడంటే !,మళ్ళీ బూట్లు వేసుకొని,బండిలో తిరక్క మానడు.
మనకి న్యూసెన్స్ మొదలు కాక మానదు.
"అని తలపోసి, సైలెంటుగా ఆ బూట్లని బండి లొంచి,బయటకు విసిరేశాడు.
ఇంక పీడా విరగడైందనుకొని,తన కోటు తీసి,ఎదురుగా ఉన్న పెగ్గుకు తగిలించి,హాయిగా నిద్ర పోయాడు.
కాసేపటికి  గొపాల కృష్ణయ్య గారు నిద్ర లేచి,బూట్లు తొడుక్కుందామని చూస్తే,అవి అక్కడ లేవు.
మోత చేస్తున్నాయని,ఇతనే బయట పారవేసి ఉంటాడని గమనించి, అతన్నిద్ర పోతుండ గానే,పెగ్గుకి వ్రేలాడుతున్న అతని కోటును తీసి బయటకు విసిరేశాడు.
ఆ కోటు ఎంత ఖరీదయినదో,అందులో ఎంత అవసరమైన రికార్డు ఉందో,టికెట్టు వగైరాలు అందులోనే ఉన్నాయన్నవిషయం కూడా అతను గమనించలేదు.
అప్పుడు తాను మాత్రం వట్టి కాళ్ళతోనే,అటు నుంచి,ఇటూ తిరుగుతూ ఉన్నాడు.
కాస్సేపటికి దొర లేచి,తన కోటు,అక్కడ పెగ్గుకి కనపడక పోయే సరికి,ప్రాణాలు ఎగిరి పోయినంత పనైందతనికి.
కారణం అతని సర్వస్వం ఆ కోటు జేబులోనే ఉన్నాయి.
ఇప్పుడింక అతన్ని పలకరించకతప్పదని,What happend to my coat ?.....అని అడిగాడు.
గోపాల కృష్ణయ్య గారు "Your coat has gone out, in search of my boot."అని సీరియస్ గా అన్నాడు.
అతను నిర్ఘాంత పోయి,చేసేదేమీ లేక,లోలోపల ఏదో గొణుక్కుంటూ,అసహనంగా కూర్చున్నాడు.
                  అందుకే అంటారు పగ ఉన్న వాడిని తిడితే,
                  భక్తి ఉన్న వాడికి ఆ పాపం తగులుతుందని.