11, మే 2012, శుక్రవారం

ఆహా! తెలుగంటే ! మరీ.......! ఇంత! చిన్న చూపా?

ఒక పండితుడు అటు శాస్త్రంలోనూ,ఇటు సాహిత్యంలోనూ. తూకానికొచ్చేమంచి కృషి చేశాడు.సాధారణంగా నాటి సమాజం ఆంగ్లమే భాషని,ఆంగ్లం చదువుకున్నవాడే మనిషనీ,తెలుగులో అసలేమీ లేదనీ,తెలుగు చదువుకున్నవాడు వట్టి చవట దద్దమ్మనీ,ఆంగ్లం చదివే దమ్ముల్లేని వాళ్ళే తెలుగుని పట్టుకొని వ్రేలాడతారనీ,తెలుగుని చిన్న చూపు చూడ్డం సహజమై పోయింది ఒకప్పుడు.కానీ అంతటి ఉద్దండ పండితుడై ఉండీ కూడా,ఆయన తెలుగుని కూడా తేలిగ్గా చూడక క్షుణ్ణంగా చదివాడు.సంస్కృతం, ఆంధ్రం రెంటిలోనూ,మాంచి కవిత్వం కూడా చెప్పగల దిట్ట కూడా కాగలిగాడు.
    పాపమాయన్ని సరస్వతి వరించింది కానీ,లక్ష్మిమాత్రం ఆయన మీద ఒక్క చిన్నచిరునవ్వైనా చిందించలేదు.అందుచేత పొట్ట చేత్తో పట్టుకొని ఉద్యోగం కోసం నువ్వా?నువ్వా?అంటూ స్కూళ్ళ చుట్టూ తిరగ సాగాడు.చివరికొక మిషన్ హైస్కూల్లో తెలుగు పండితునిగా మరీ అతి తక్కువ జీతానికి ఒక ఉద్యోగం దొరికింది.దానికే ఆయనకి గజారోహణం జరిగినంత సంబర పడి పోయాడుకూడా!స్కూళ్ళలో గదులూడ్చే వాడిమీద కూడా కొంత గౌరవం ఉంటుంది కానీ,తెలుగు పండితుని మీద మాత్రం ఈగ కాలంత లక్ష్యం ఉండదు.అంటే అతిశయోక్తి కాదేమో!"నమస్కారం పంతులుగారూ"!అని మొగం మీద అని,పక్క వాడి వంక చూసి కిసుక్కున నవ్వుకుంటారు.ఎవరేమనుకున్నాఆ నాలుగు రాళ్ళూ చేతికి రాకపోతే,కొంపలో కుండలు డింకీలు కొడతాయి కాబట్టి తలకాయొంచుకొని,ఉద్యోగం చేయక తప్పదని నిర్ణయించుకున్నాడు ఆ తెలుగుభాషా నిష్ణాతుడు.
                ఇలా ఉండగా ఒక నాడా పండితుని తండ్రి ఆబ్దీకం వచ్చింది.అందుకొక రోజు ముందుగానే ఆయన హెడ్ మాస్టర్ని కలుసుకొని'అయ్యా!రేపు మా తండ్రి గారి ఆబ్దీకం.కనుక నాకు దయ చేసి సెలవి ప్పించండీ!అని సవినయంగా అర్ధించాడు. ఆయన్ను ఏడిపించాలని ఆహెడ్మాస్టర్"'ఏమిటీ!తద్దినమా? తద్దినానికి సెలవెందుకు?పొద్దున్నవర్క్ చేసి మధ్యాహ్నం ఇంటర్వెల్లో ఇక్కడే పెట్టుకోరాదూ?"అన్నాడు.ఆయన నిర్వికారంగా చిత్తం!అని వెళ్ళీపోయాడు.
           మర్నాడొక కొల్లాయి పంచె కట్టుకొని,ఒక తువ్వాలు పైన వేసుకొని,నాలుగు విస్తళ్ళు,ఒక దర్భకట్ట,నువ్వులు, బియ్యప్పిండి,రెండు చెంబులు,గ్లాసుతో ఆవుపాలు ఇవన్నీ పుచ్చుకొని,తలపాగా లేకుండా,ముడేసుకున్న పిలకతో స్కూలుకొచ్చి,సంతకం పెట్టడానికి హెడ్మాష్టర్ రూములోకి వెళ్ళాడు.హెడ్మాష్టర్ ఆయన్నీ,ఆయన వేషాన్ని చూసి కంగు తిన్నాడు.'ఏమిటీ..ఈ వేషం?అన్నాడు.తమరే అన్నారు కదండీ? సెలవివ్వనని,ఇక్కడే!తద్దినం పెట్టుకోమనీను?అందు చేతనే కర్మ కాండ జరుపుకోవడానికి వీలైన వేషంలో వచ్చాను.మీరు సెలవివ్వనన్నారుగదా!అని నేను కర్మ విసర్జించి ఆచార భ్రశ్టుడను కాలేను కదా?అన్నాడా పండితుడు.ఇంతలోనే మిగతా టీచర్లు, పిల్లలు అక్కడకు వచ్చిమూగారు.బంట్రోతులు చెవులు కొరుక్కున్నారు.కానీ ఆ పండితుడవేమీ లక్ష్య పెట్టలేదు.నిశ్చలంగా నిల్చున్నాడు.'స్కూలికిలా!రాకూడదని హెడ్మాష్టర్ కసురు కున్నాడు.ఈ పరిణామం ముందుగా ఊహించే,ఆ పండితుడు ఇంటిదగ్గరే వ్రాసుకొచ్చిన రాజీనామా పత్రాన్ని హెడ్మాష్టర్ టేబుల్ మీద పెట్టి'నా వేషం మీకు పనికి రాదు!మీ ఉద్యోగం నాకు పనికి రాదు!అని వ్యాఖ్యానించి గిరుక్కున వెనుతిరిగి ఇంటికి వెళ్ళి పోయాడు.టీచర్లలో వివేకం గలవాళ్ళు'అయ్యో!ఒక విశిష్ట పండితుడు బాధ పడ్డాడనీ,ఆయన మానేసిన తరువాత కానీ ఆయన గొప్పతనం తెలియలేదు పిల్లలకి.ఇంక మళ్ళీ జన్మలో ఆయన నౌకరీ కోసం ఎగబడకుండా ఇంటి దగ్గరే పదిమందికి చదువు చెపుతూ,జీవితాన్ని తెలుగు భాషా ప్రచారం కోసం వెచ్చించి తరించాడు.